హనీట్రాప్ భయం.. ఆటగాళ్ల రూముల్లో ఆకస్మిక తనిఖీలు.. ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌పై బీసీసీఐ నిఘా!

  • ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హనీట్రాప్ పై బీసీసీఐ తీవ్ర హెచ్చరిక
  • ఆటగాళ్ల హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం
  • అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం
  • నిబంధనలు మిరితే భారీ జరిమానాలు, సస్పెన్షన్ తప్పదని స్పష్టీకరణ
  • హోటల్ నుంచి బయటకు వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఐపీఎల్ ప్రతిష్ఠను కాపాడే దిశగా, ఆటగాళ్లు, అధికారులు 'హనీట్రాప్' బారిన పడకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆటగాళ్లు బస చేసే హోటల్ గదుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఈ మేరకు 10 ఫ్రాంచైజీలకు ఏడు పేజీల సుదీర్ఘ మార్గదర్శకాలను పంపారు. "అత్యున్నత స్థాయి క్రీడా వాతావరణంలో హనీట్రాప్, ఇతర ప్రమాదాలు పొంచి ఉంటాయి. వీటివల్ల లైంగిక ఆరోపణలతో సహా తీవ్రమైన చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి ముప్పును నివారించడానికి ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి" అని సైకియా ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ నిబంధనల అమలు కోసం బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందం హోటల్ గదులను ఆకస్మికంగా తనిఖీ చేస్తుంది. ఆటగాళ్ల గదిలోకి వారి బంధువులు అయినా సరే, టీమ్ మేనేజర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించరాదని స్పష్టం చేశారు. అలాగే, ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది వ్యక్తిగత పనుల మీద హోటల్ బయటకు వెళ్లాలనుకుంటే, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ (ఎస్ఎల్ఓ), టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్ (టీఐఓ) నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఈ వివరాలను టీమ్ మేనేజర్‌కు కూడా తెలియజేయాలి.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి సైకియా హెచ్చరించారు. నిబంధనలు పాటించని ఫ్రాంచైజీలు, సంబంధిత వ్యక్తులపై ఐపీఎల్ నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు, భారీ ఆర్థిక జరిమానాలు, సస్పెన్షన్ లేదా అనర్హత వేటు వంటి కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఫ్రాంచైజీలు ఎప్పటికప్పుడు ఆడిట్లకు, తనిఖీలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫ్రాంచైజీల యజమానులు డగౌట్‌లోని ఆటగాళ్లు లేదా మేనేజర్లతో మాట్లాడకూడదని కూడా బీసీసీఐ స్పష్టం చేయడం గమనార్హం.

BCCI
IPL 2026
honey trap
player safety
corruption prevention
Devajit Saikia
BCCI guidelines
IPL regulations
team integrity
anti corruption

More Telugu News